ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు. వీరి కుమారుడు జంపన్న ఆత్మాభిమానంతో సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో సమ్మక్క ఆదిపరాశక్తి గా మారి వీరోచిత పోరాటం చేస్తుంది. అయితే కాకతీయ సైన్యం దొంగచాటుగా దెబ్బతీయడంతో సమ్మక్క చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యం అవుతుంది.
Read: TATA Group: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్న్యూస్…విమానం రద్దయితే…
సమ్మక్క అదృష్యమైన చిలుకల గుట్ట ప్రాంతంలోని నాగవృక్షం దగ్గర ఓ కుంకుమ భరిణ లభించింది. దానినే సమ్మక్కగా భావించి మాఘపూర్ణిమ రోజున పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో ప్రధాన ఘట్టం చిలుకల గుట్టలో ఉన్న కుంకుమ భరిణని తీసుకురావడమే. ప్రధాన పూజారి చిలుకల గుట్టకు ఒంటరిగా వెళ్లి భరిణను తీసుకొని కిందకి వస్తాడు. పూజారి రాకను గమనించిన తరువాత పోలీసులు గౌరవ వందనంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. సారక్క వనదేవత వస్తుందని గుర్తించిన భక్తులు పరవశించిపోతారు. మేళతాళాలు మిన్నంటుతాయి. ఈ భరిణను గద్దెల వద్ద ఉంచుతారు. నాలుగోరోజు పూజలు నిర్వహించిన అనంతరం వనదేవతలను తిరిగి అక్కడి నుంచి తరలించడంతో జాతర ముగుస్తుంది. తొలిరోజు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు లను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర మొదలౌతుంది. సమ్మక్క ఆహ్వానంతో రెండో రోజు జాతర జరుగుతుంది. ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువైన తరువాత మూడో రోజు జాతర అంగరంగ వైభవంగా జరుగుతంది. అమ్మల వనప్రవేశంతో నాలుగో రోజు జాతర ముగుస్తుంది.