Today (30-01-23) Business Headlines:
ఏపీలో ఒబెరాయ్ హోటల్స్
ఆంధ్రప్రదేశ్‘లోని వివిధ జిల్లాల్లో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDCతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా మొదట తిరుపతిలోని అలిపిరిలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన కేటాయించింది. ఏపీలో అలిపిరితోపాటు హార్సిలీహిల్స్, గండికోట, పిచ్చుకల లంక, అరకు లోయల్లో ఒబెరాయ్ హోటల్స్ రానున్నాయి.
21 వేల మంది తొలగింపు
ఇండియన్ స్టార్టప్స్ గడచిన మూడు నాలుగు నెలల్లో 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. నిధుల సమస్య నెలకొనటంతో రానున్న రోజుల్లో మరింత మందికి పింక్ స్లిప్’లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎడ్-టెక్ సెక్టార్’లోని 16 స్టార్టప్’లు అత్యధికంగా 8 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపాయి. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యాక 16కు పైగా స్టార్టప్’లు లేఆఫ్’లను ప్రకటించాయి. కొన్ని సంస్థలు ఉద్యోగుల తొలగింపులో 2వ దశనూ ప్రారంభించాయి.
ఎన్ఎస్ఈ అరుదైన ఘనత
మన దేశంలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. NSE.. అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్’గా నిలిచింది. వరుసగా నాలుగో సంవత్సరం ఈ ఫీట్’ను సొంతం చేసుకోవటం విశేషం. 2022వ సంవత్సరంలో ట్రేడ్ అయిన డెరివేటివ్ కాంట్రాక్టుల మొత్తం సంఖ్య ఆధారంగా ఫ్యూచర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అనే సంస్థ ఈ ర్యాంకులు కేటాయించింది. ఈక్విటీ విభాగంలో NSE మూడో ర్యాంక్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనే ఒక కొత్త విభాగాన్ని ప్రారంభిస్తామని NSE పేర్కొంది.
‘గూగుల్’లో వేతన కోతలు
ఇప్పటివరకు ఉద్యోగుల తొలగింపునకు మాత్రమే పరిమితమైన గూగుల్ సంస్థ ఇప్పుడు వేతనాల్లో కోతలకు కూడా రంగం చేసింది. ఈ విషయాన్ని సంస్థ CEO సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తెలియజేశారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్టాఫ్ యాన్యువల్ బోనస్’ను భారీగా కట్ చేయనున్నట్లు చెప్పారు. అయితే.. ఈ వేతన కోతలు ఎన్నాళ్లు కొనసాగుతాయి?, ఏ మేరకు ఉంటాయి? అనే అంశాలను మాత్రం స్పష్టం చేయలేదు. CEO సుందర్ పిచాయ్ పేప్యాకేజీకి సైతం గండి పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంధన చరిత్రలో తొలిసారిగా
మన దేశ ఇంధన చరిత్రలో సరికొత్త పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇన్నాళ్లూ ఏవియేషన్ గ్యాస్’ను దిగుమతి చేసుకున్న ఇండియా ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. AV గ్యాస్’ను పపువా న్యూ గునియా దేశానికి ఎక్స్’పోర్ట్ చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సర్వం సిద్ధం చేసింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. AV గ్యాస్’ను మానవ రహిత విమానాలు మరియు చిన్న చిన్న శిక్షణ విమానాలకు ఇంధనంగా వాడతారనే సంగతి తెలిసిందే.
‘ఇండియా అహెడ్’.. క్లోజ్..
ఇండియా అహెడ్ అనే ప్రైవేట్ ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ కార్యకలాపాలను నిలిపివేశారు. ఛానల్’ను నడిపే పరిస్థితి లేకపోవటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. తమకు నెలల తరబడి వేతనాలు ఇవ్వలేదని ఆ ఛానల్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతన బకాయిలు విడుదల చేయాలని రిపోర్టర్లు, యాంకర్లు తదితర ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఛానల్ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఉద్యోగులకు శాలరీ ఇచ్చేందుకు మేనేజ్మెంట్ శతవిధాలా ప్రయత్నం చేస్తోందని చెప్పారు.