కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని పేర్కొంది. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి అనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు విమాన ప్రయాణికులను హెచ్చరిస్తూ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది.
కొవిడ్ సేఫ్టీ నిబంధలను ఉల్లంఘించే ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే డీజీసీఏ ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలు పాటించని ప్రయాణికులను ‘నో-ఫ్లై’ జాబితాలో చేర్చవచ్చునని, తదుపరి చర్యల కోసం సెక్యూరిటీ ఏజెన్సీలకు అప్పగించవచ్చునని ఢిల్లీ హైకోర్ట్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Crops MSP Hike: రైతులకు కేంద్రం శుభవార్త.. 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం 3714 కేసులు నమోదవగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 5,233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది డిశ్చార్జీ అయ్యారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు ఉన్నాయి. ఇందులో 1242 కేసులు ముంబైకి చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కేరళలో 1494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 కేసులు ఉన్నాయి.