గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. చైనాలోని వూహాన్ నగరంలో మొదటిసారి కరోనా బయటపడిన తరువాత ఈ వైరస్ అనేక రకాలుగా మార్పులు చెందుతూ దాడులు చేస్తూనే ఉన్నది. సార్స్ కోవ్ 2, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ఇబ్బందులకు గురిచేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అయితే, మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌ను కనుగొన్న తరువాత మరణాల సంఖ్య తగ్గింది. సాధారణంగా కరోనా వైరస్ మనిషి శరీరంలో రెండు వారాల వరకు ఉంటుంది. మందులు తీసుకుంటే తగ్గిపోయి నెగెటివ్ వస్తుంది. మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ, ఓ వ్యక్తి గత 14 నెలలుగా కరోనాతో పోరాటం చేస్తున్నాడు. టర్కీలో నివసించే ముజఫర్ కయాసన్ అనే వ్యక్తికి నవంబర్ 2020లో కరోనా సోకింది. రెండు వారాలపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు పాటించాడు.
Read: Covid 19 Vaccination: యూఎస్‌లో నాలుగో డోసు…
ఇంటికి వెళ్లిన తరువాత కరోనా పరీక్షలు చేయిస్తే పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సార్లు కరోనా పరీక్షలు చేయించాడు. 78 సార్లు అతనికి కరోనా పాజిటివ్‌గానే నిర్ధారణ జరిగింది. 14 నెలలుగా హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్సపోందుతున్నాడు. ముజఫర్ ల్యూకేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, అతనిలో రోగనిరోధక శక్తి అత్యల్పంగా ఉందని, అందుకే ఆ వ్యక్తి శరీరంలో నుంచి కరోనా వెళ్లిపోవడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే, తీవ్రమైన కరోనా లక్షణాలు లేకపోవడంతో ముజఫర్ జీవించగలుగుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు.