త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గం మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లో ఓపిక పట్టిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. 70 ఏండ్లలో కాంగ్రెస్, టిడిపి వాళ్ళు తాగు, సాగు నీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు. వర్షా కాలం రాక ముందే రైతుబంధు ఇచ్చిన ఘనత కెసిఆర్ ది అని.. అవసరమైతే మిగతా పనులు ఆపుతాం కానీ.. రైతులకు మాత్రం అన్ని సరైన సమయంలో ఇస్తామని హామీ ఇచ్చారు. ఎద్ద ఎత్తున ఇల్లు కట్టి ఇస్తున్నామని… ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఆవినీతికి తావు లేకుండా అర్హులకు డబుల్ బెడ్ రూంలు ఇస్తున్నామని పేర్కొన్నారు.