భారత్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్‌లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్‌తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన, మెచ్చిన ఆటగాడు కోహ్లీ పుట్టినరోజు నేడు. నవంబర్ 5, 1988న జన్మించిన అతడు.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 13 ఏళ్లు దాటుతోంది.
Read Also: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన బ్రావో !
సచిన్ సాధించిన పరుగులు, సెంచరీలను ప్రపంచంలో ఎవరైనా అధిగమిస్తారా అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. కానీ కొన్నాళ్లకే క్రికెట్ పండితుల సందేహాలను పటాపంచలు చేసి మొనగాడినని నిరూపించుకున్నాడు కోహ్లీ. అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో ఇప్పటికే 23వేలకు పైగా పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు ఉన్న ఆటగాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు (3,225) చేసిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మూడో ఆటగాడు. కోహ్లీ ఇప్పటివరకు 57 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక విజయాలు (38) అందించాడు. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో 41 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంకును పొందింది.
అంతేకాకుండా అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్(19) అవార్డులను అందుకున్న రెండో ఆటగాడు. మూడు ఫార్మాట్లలో 70 సెంచరీలు పూర్తి చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (2010-2020), వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది 2017-18, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2012, 2017, 2018), ఐసీసీ స్పిరిట్ ప్లేయర్ 2019, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది 2018 అవార్డులను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఏకైక ఆటగాడు కూడా విరాటే. అటు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు అందుకున్న ఆటగాడు కూడా అతడే. అయితే ఎన్ని రికార్డులు ఉన్నా విరాట్ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్ రాకపోవడం నిరుత్సాహపరిచేదే. ఈ ఒక్క రికార్డును కూడా కోహ్లీ సాధించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఐపీఎల్‌లోనూ అతడి కెప్టెన్సీలో టైటిల్ రాకపోవడం గమనార్హం.