టీమిండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించడంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో 50 విజయాలు సాధించిన మొదటి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా ప్రతి ఫార్మాట్‌లో కనీసం 50 విజయాలు సాధించిన తొలి క్రికెటర్‌గానూ రికార్డు అందుకున్నాడు. విరాట్ సాధించిన ఈ అరుదైన రికార్డుపై బీసీసీఐ అభినందనలు తెలిపింది.
కాగా టెస్టుల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 66 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా జట్టుకు 39 విజయాలు అందించాడు. ఇందులో 16 మ్యాచ్‌లు ఓడిపోగా 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వన్డేల్లో విరాట్ కోహ్లీ 95 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా అందులో 65 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లీ 70.43 విజయాల శాతం కలిగి ఉన్నాడు. టీ20 మ్యాచ్‌ల విషయానికి వస్తే 49 టీ20లకు సారథ్యం వహించిన కోహ్లీ 29 విజయాలు అందించాడు.
మరోవైపు న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ విజయంతో సొంతగడ్డపై టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. 2012 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు సొంతగడ్డపై ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. వరుసగా 14 సిరీస్‌లకు 14 గెలుచుకుంది. సొంతగడ్డపై భారత్ చివరిసారిగా 2012లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ధోనీ సారథ్యంలో భారత జట్టు చెత్తగా ఆడటంతో ఆ సిరీస్‌ను చేజార్చుకుంది. 2014లో ధోనీ నుంచి విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.
Read Also: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానానికి ఎగబాకిన టీమిండియా