హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో కె.కేశవరావు ఆత్మీయంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కౌగిలించుకోవడం అక్కడ ఉన్న పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజురాబాద్ నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ వరుసగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే.. ఈటలను కౌగిలించుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. ప్రస్తుతం వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లు వీరిద్దరూ ఒకే పార్టీలో పనిచేయడంతోనే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.