బీజేపీలో కొన్నేళ్లుగా నరేంద్ర మోదీకి ఎదురులేకుండా పోతోంది. ఆయన ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోంది. మోదీ ఇమేజ్ కారణంగానే బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోని వచ్చిందని ఆపార్టీ నేతలు భావిస్తుంటారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని, ప్రభుత్వంలోగానీ మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. ఒకవేళ ఎవరైనా మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల పదవి ఊడటమో.. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించడమో చేయడం వంటి సంఘటనలు కన్పిస్తుంటాయి.
నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక క్యాబినెట్లో మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఒకరిద్దరు మంత్రులు మినహా మిగతా వారంతా ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాల్లేవు. వీరందరికీ మోదీ భజన తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్టవు. అంతా మోదీని చూసుకుంటారని భావిస్తుంటారు. ఇక బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్లు కన్పిస్తుంది.
బీజేపీ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినట్లుగానే.. మోదీ మంత్రివర్గంలోని వారిలోనూ కొంత వ్యతిరేకత వచ్చినట్లు కన్పిస్తుంది. ఈక్రమంలోనే బీజేపీ నేతలు కొందరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఆమధ్య మోదీ విధానాలను వ్యతిరేకిస్తూ సినీనటుడు, బీజేపీ నేత శతృజ్ఞ సిన్హా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మోదీ సీరియస్ కావడంతో ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత యశ్వంత్ సిన్హాతోపాటు మరికొందరు మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడి పార్టీకి దూరం కావాల్సి వచ్చింది.
తాజాగా ఇప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ వంతు వచ్చినట్లు కన్పిస్తోంది. ఇటీవల బీజేపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలపై ఆయన వ్యాఖలు చేశారు. పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు ఎవరూ కూడా సంతోషంగా లేరని జైపూర్లో జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల సీఎంలను మారుస్తున్న క్రమంలోనే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గడ్కరీ డైరెక్ట్ గా మోదీని ఉద్దేశించి ప్రస్తావించకపోయినా సూటిగా మోదీకే తాకేలా ఆ మాటలున్నాయి. దీంతో బీజేపీలో లుకలుకలు మొదలైనట్లు కన్పిస్తున్నాయి.
గత ఆరునెలల కాలంలో బీజేపీ ఏకంగా ఆరుగురు సీఎంలను మార్చింది. మరోవైపు కొందరు మంత్రులు తమకు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వలేదని మండిపడుతున్నారు. దీనికితోడు చెప్పాపెట్టకుండా సీఎంలను మారుస్తుండటంతో తమ పదవి ఎక్కడ పోతుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మెల్లిమెల్లిగా బీజేపీ నేతలు తమ అసంతృప్తిని మోదీపై వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే గడ్కరీ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేయగా ఆయన బాటలో మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటలన్నీ చూస్తుంటే ఇంటా బయట మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లు కన్పిస్తోంది. దీంతో మోదీ ఈ విషయంలో అధిష్టానం పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతారనేది ఆసక్తికరంగా మారింది.