రోజులు,ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ.. నామినేటెడ్ పదవులపై చాలామంది టీఆర్‌ఎస్ నేతల ఆశలు తీరడంలేదు. ఈ ఏడాదిలోనైనా వారికల నెరవేరుతుందా? అధికారపార్టీ ఆలోచన ఏంటి? పదవులతో ఎంతమందిని సంతృప్తి పర్చగలదు? కొత్త ఏడాదిలో పదవులు వస్తాయనే ఆశల్లో నేతలు గంపెడాశలతో వున్నారు. 2018 డిసెంబర్‌లో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నామినేటెడ్ పదవులపై అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
అప్పటికే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి పదవీకాలం ముగియడంతో వాళ్లల్లో కొందరికి మరోఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. గడిచిన ఏడాది చివరిలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో కొత్తవారికి అవకాశం కల్పించింది అధికారపార్టీ. ఇందులో యువతకు ఛాన్స్ ఇవ్వడం.. సామాజిక, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పేర్లు ప్రకటించడంతో మిగతావారిలోనూ ఆశలు రేకెత్తాయి. కొత్త ఏడాదిలో ఆ ఛాన్స్ వస్తుందని చాలామంది లెక్కలేసుకుంటున్నారు కూడా.
నామినేటెడ్ పదవుల్లో యువతకు ప్రాధాన్యం వుంటుందా?
ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఈలోగా నామినేటెడ్ పదవులు చేపడితే జనాల్లో మళ్లీ బలం పుంజుకోవచ్చుననే అంచనాల్లో ఉన్నారు అధికారపార్టీ నాయకులు. ఇటీవల ఒకేసారి 19 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్‌ఎస్ భర్తీ చేసింది. వాటిపై చాలా మంది ఆశ పెట్టుకున్నా.. అనేక వడపోతల తర్వాత అనూహ్యంగా కొందరి పేర్లు జాబితాలోకి వచ్చాయి. మరికొందరి పేర్లు లిస్ట్‌లో నుంచి జారిపోయాయి. అలా చర్చల్లోకి వచ్చిన పేర్లతో కొందరిని నామినేటెడ్ పోస్టులతో సంతృప్తి పరిచారు. ముఖ్యంగా యువతకు పట్టంకట్టడం.. ఆ వర్గాల్లోనూ పదవులు ఆశించేవారి సంఖ్య పెరిగింది.
టీఆర్ఎస్‌లో తమకు పరిచయం ఉన్న నాయకులు.. అధిష్ఠానంతో దగ్గరగా ఉండేవారితో లాబీయింగ్ చేస్తున్నారట కొందరు యువ నేతలు. ఇప్పటికే వివిధ సందర్భాలలో అధినేత నుంచి హామీ పొంది.. పదవుల కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్యే చాంతాడంత ఉంది. ఆయా హామీల ప్రకారం.. వారి స్థాయిని భట్టి పదవులను ప్రకటిస్తారని 2018 నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. పైగా పదవుల పందేరంలో పాతవాళ్లతోపాటు కొత్తవారు కూడా ఉండటంతో నేతల దృష్టి ప్రగతిభవన్‌పై పడింది. మారుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో సెగలు పుట్టిస్తున్నాయి. పైగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్‌గా ఎత్తుగడలు మొదలుపెట్టిన అధికారపార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో ఇదే దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అన్నది ఒక ప్రశ్న. ఇప్పటి వరకు ప్రకటించిన పదవులు చాలని అనుకుంటే.. ఆశల పల్లకీలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఈ విషయంలో అధికారపార్టీ ఆలోచన ఏంటో.. ఎవరికి పదవీయోగం ఉంటుందో కాలమే చెప్పాలి.