భారత ప్రభుత్వం తాజాగా చేసిన సినిమాటోగ్రఫీ సవరణ వల్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు భారీ దెబ్బ తగలనుంది. దీనివల్ల 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని అనుసరించి సెన్సార్ బోర్డ్ క్లీన్-చిట్ ఇచ్చిన చిత్రాలను తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాలను రీఎగ్జామ్ చేసే అధికారం రానుంది. అంటేపరోక్షంగా సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందిన ఏ చిత్రంనైనా నిషేధించటం లేదా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు గళం విప్పుతున్నారు. అంతే కాదు ఈ యాక్ట్ కి వ్యతిరేకంగా పిటిషన్‌లో సంతకం చేయమని ప్రజలను కోరుతున్నారు. బాలీవుడ్ నుండి అనురాగ్ కశ్యప్, హన్సాల్ మెహతా, ఫర్హాన్ అక్తర్, షబానా అజ్మీ, దిబాకర్ బెనర్జీతో మరికొందరు ఈ బిల్లు అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ బహిరంగంగా లేఖ రాశారు.
దక్షిణాదిన కూడా తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ గొంతు పెంచారు. కమల్ హాసన్, సూర్య, గౌతమ్ మీనన్, పిసి శ్రీరామ్ సోషల్ మీడియాలో సినిమాటోగ్రఫీ యాక్ట్ పై ప్రభుత్వ ప్రతిపాదనను నిరసించారు. ఇలా ఇతర పరిశ్రమల ప్రజలు తమ గొంతును పెంచుతుంటే… తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉంది. నిజానికి టాలీవుడ్ దేశంలో అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. భారీసంఖ్యలో సినిమాలు తీసేది మనమే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి బడా స్టార్స్ ఉన్నా ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడటంలేదు.
టాలీవుడ్ నటులు ఎప్పుడూ గోడమీద పిల్లులులాగా వ్యవహరించటం ఇదిమొదటిసారి కాదు. అధికార పార్టీలతో ఎల్లప్పుడూ సయోధ్యనే కోరుకుంటుంటారు. కమర్షియలిటీకి ప్రాధాన్యమిస్తూ… సమాజాన్ని ప్రశ్నించే సినిమాలు తీసేవారు టాలీవుడ్ లో తక్కువగా ఉండటంకూడా ఓ కారణం కావచ్చు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ బిల్లును వ్యతిరేకించిన ఏకైక టాలీవుడ్ ప్రముఖుడు కావటం విశేషం. మరి ఈ కొత్త యాక్ట్ పై చర్చ వాడిగా వేడెక్కుతున్న ఈ సమయంలో మన టాలీవుడ్ హీరోలలో ముందుగా గళం విప్పేది ఎవరో చూడాలి.
