తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా….శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు. కాగా డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీవ్రనష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు టీటీడీలో భర్తీకాదని అభిప్రాయపడ్డారు.
1944లో తిరుపతిలో జన్మించిన డాలర్ శేషాద్రి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ పూర్తి చేసిన వ్యక్తిగా ఆయన పేరు సంపాదించారు. డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. అయితే మెడలో పొడువైన డాలర్ ధరించి ఉండటంతో ఆ పేరుతో ప్రసిద్ధి చెందిన శేషాద్రి. శేషాద్రి పూర్వీకులు తమిళనాడు రాష్ర్టంలోని కంచి ఆలయంలో విధులు నిర్వర్తించేవారు. శేషాద్రి స్వామి తండ్రి తిరుమల నంబి ఆలయంలో గుమస్తాగా పనిచేశారు.
1978లో డాలర్ శేషాద్రి టీటీడీలో చేరారు. 2006 జూన్‌లో రిటైర్మెంట్ తీసుకోగా అప్పటి నుంచి తిరుమల ఆలయ ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. శేషాద్రికి భార్య, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 2013లో శేషాద్రికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. 2016లో శేషాద్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చికిత్స అనంతరం కోలుకున్నారు. 2006లో డాలర్ శేషాద్రిపై బంగారు డాల్లర్లు మిస్సింగ్ అభియోగాలు వచ్చాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టగా సచ్చీలుడిగా బయటపడ్డారు. 2009లో అప్పటి ఈవో కృష్ణారావు ఆదేశాల మేరకు 9 నెలల పాటు విధులకు శేషాద్రి దూరమయ్యారు. తిరిగి కోర్టు ఆదేశాలతో మళ్లీ విధుల్లో చేరారు. శేషాద్రి సర్వీసులో 15 నెలల కాలం మినహయిస్తే… పూర్తిగా శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణతో శేషాద్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల తిరుమల పర్యటన సందర్భంగా స్వయంగా సీజేఐ ఎన్వీ రమణ శేషాద్రి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని శేషాద్రికి ఎన్వీ రమణ సూచించారు.
Read Also: హత‘విధీ’… పట్టుకున్న పామే కాటేసింది