ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Also: ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్
మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నాడు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాల వాసులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పలుచోట్ల ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.