ఈ నెల 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి ప్రశ్నోత్తరాల సమయాన్ని అసెంబ్లీ చేపట్టనుంది. సభ ముందుకు ఏపీ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్ క్రమబద్ధీకరణ బిల్లు రానుంది. అంతేకాకుండా బీసీ కులాల వారీ జనగణనకు అసెంబ్లీ తీర్మానం చేయనుంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం పై స్వల్ప కాలిక చర్చ నిర్వహించనున్నారు. మొన్నటి సభలో జరిగిన వ్యక్తిగత దూషణల వ్యవహారం పై స్పీకర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో జరిగిన వ్యక్తిగత దూషణల వ్యవహారంలో ఎడిట్ చేయని ఆడియో, వీడియో ఫుటేజ్ కోసం ఇప్పటికే టీడీపీ సభ్యుడు అనగాని స్పీకర్ కు లేఖ రాశారు. అయితే నేటి నుంచి సమావేశాలకు హజరుకావద్దని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఉదయం 10 గంటలకు మూడో రోజు మండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. సభ సమావేశం అయిన వెంటనే రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నిసాకు మండలి నివాళులు అర్పించనుంది.