తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్ యత్నించారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు.
అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం కేటాయింపు జరగలేదని, 317 జీవోతో భార్య భర్తలను విడదీస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉద్యోగులను వేరే చోటుకు బదిలీ చేయడం అన్యాయమని, ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. 317 జీవో రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని వెల్లడించారు.