ఇప్పటికే పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. వరుసగా పెరుగుతూ సామాన్యుడికి గుది బండగా మారిన పెట్రో ధరలపై గురు పెట్టారు.. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ బహిరంగలేఖ రాశారు.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని దుయ్యబట్టారు.. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే తమ పనిగా పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం అంటూ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంభిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణమని.. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తున్నది అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Pudding and Mink Drugs case: రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజేపీదే అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుందన్న ఆయన.. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా… దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని నిలదీశారు.. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుందని ఎద్దేవా చేశారు.. పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ అని ఆరోపించిన కేటీఆర్.. అందుకే అచ్చేదిన్ కాదు.. అందర్నీ ముంచే దిన్ అన్నారు.. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధానమంత్రి మోడీ.. పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని మండిపడ్డ కేటీఆర్.. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని మోడీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయమని.. ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.