తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుల వాయిస్ పెరిగిందా..? పీసీసీ లక్ష్యంగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? ఆ వ్యాఖ్యల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపించారా?
రేవంత్ అందుబాటులో ఉండటం లేదని డీసీసీల ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ సభ్యత్వాలు చేయించాలని చెబుతుంటే..! సరే.. మా సంగతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నల వెనక వ్యూహం ఏంటి? జిల్లాలలో ఉన్న అసంతృప్తిని పీసీసీ దృష్టికి తీసుకెళ్లాలనే ఆ స్వరం ఎత్తుకున్నారా? గాంధీభవన్‌లో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈరకమైన టోన్ గట్టిగానే వినిపించింది. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన భేటీలో డీసీసీలు తమ అసంతృప్తిని బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుత్వం నమోదు కోసం గుర్తొచ్చే తాము.. పార్టీ టికెట్లు ఇచ్చే టైమ్‌లో గుర్తుకు రామా అని సూటిగా ప్రశ్నించారట. పనిలోపనిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అందుబాటులో లేరని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వాస్తవానికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ సారథిగా రావాలని చెప్పినవాళ్లలో DCCలే ఎక్కువ. అలాంటిది వాళ్ల నుంచే రేవంత్‌కు వ్యతిరేకంగా వాయిస్ వినిపించడం పార్టీలో చర్చగా మారింది.
పెద్దపల్లి అభ్యర్థి ప్రకటనపై రగడ
ఇటీవల పెద్దపల్లి అభ్యర్థిగా విజయ రమణారావును పేరును రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తప్పుపట్టారు. ఆయనకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కూడా శ్రుతి కలిపారట. ఆ అంశం కేంద్రంగానే రేవంత్ తీరుపై ప్రశ్నల పరంపర సాగినట్టు తెలుస్తోంది. అయితే కొందరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల తీరుపై పార్టీలో కొంత అసంతృప్తి ఉంది. అది కూడా తాజా పరిణామాలకు కారణంగా అనుమానిస్తున్నారు.
పీసీసీకి రాష్ట్ర కార్యవర్గం వచ్చే వరకు సమస్యలే?
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు తర్వాత పీసీసీకి కొత్త కమిటీని.. జిల్లాలకు కొత్తగా పార్టీ అధ్యక్షులను ప్రకటిస్తారని అనుకుంటున్నారు. అందుకే డీసీసీలలో అభద్రతా భావం ఉందని కొందరి వాదన. ప్రస్తుతం పార్టీలో అందరి దృష్టీ సభ్యత్వ నమోదుపై ఉంది. మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగే వీలుంది. అది ముగిశాక AICC కొత్త చీఫ్ ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. ఆ తర్వాతే రాష్ట్రంలో పార్టీ పదవుల నియామకం ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు కొత్త డీసీసీల నియామకం లేనట్టే. కొత్త టీమ్ వచ్చే వరకు పాత టీమ్‌తోనే సభ్యత్వ నమోదు చేయాలనే ఆలోచనలో పీసీసీ ఉంది. ఆ కారణంగానే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో రేవంత్ టచ్‌మీ నాట్‌గా ఉన్నారా అనే ప్రచారం జరుగుతోంది. పార్టీకి కొత్త రాష్ట్ర కార్యవర్గం వచ్చే వరకు ఇలాంటి సమస్యలు తప్పవని అనుకుంటున్నారు.
డీసీసీలుగా ఉన్నవాళ్లలో ఎంతమందికి రెన్యువల్?
ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో పై స్థాయిలోనే ఒక విధమైన రచ్చ నడుతోంది. ఇప్పుడు దానిని జిల్లాల స్థాయికి తీసుకెళ్లి.. ఇంకా రచ్చ చేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు జిల్లా సారథులుగా ఉన్నవాళ్లలో ఎంత మందిని కొనసాగిస్తారు? ఎంతమందికి పార్టీ పదవుల్లో పదోన్నతులు కల్పిస్తారో క్లారిటీ లేదు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో కలహాలు తప్పవనే అభిప్రాయం ఉంది.