విడుదల: డిస్నీ హాట్ స్టార్
తేదీ : నవంబర్ 19,2021
నటీనటులు: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, తులసి
దర్శకుడు: మల్లిక్ రామ్
సంగీత దర్శకుడు: రాధన్
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత
నిర్మాతలు : మండవ సాయి కుమార్, చంద్ర శేఖర్ మొగుళ్ల, సృజన్ యరబోలు
బాలనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా ‘ఓ బేబీ’, ‘జాంబిరెడ్డి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన నటించిన ‘ఇష్క్’ డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో
శివాని రాజశేఖర్ కలసి నటించిన ‘అద్భుతం’ డిజిటల్ మీడియాలో విడులైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
సూర్య (తేజ సజ్జ) జీవితం పట్ల నిరాసక్తతతో న్యూనతకి లోనై ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే టైమ్ లో వెన్నెల (శివానీ రాజశేఖర్) కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. చనిపోయే ముందు సూర్య తన ఫోన్ కి మెసేజ్ పంపుతాడు. అయితే అది వెన్నెలకి డెలివరీ అవుతుంది. సూర్య, వెన్నెల ఇద్దరూ కామన్ ఫోన్ నంబర్ ఎలా షేర్ చేసుకున్నారు? తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? అన్నదే ఈ చిత్రం కథాంశం.
తేజ సజ్జ తన పాత్రలో లీనమై చక్కగా చేశాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఇక హీరోయిన్ శివాని రాజశేఖర్ పక్కింటి అమ్మాయిగా బాగా నప్పింది. అయితే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం సరిగ్గా కుదరలేదని చెప్పాలి. ఇక తులసి, శివాజీరాజా వంటి ఇతర ఆర్టిస్టులు తమ పాత్రకు న్యాయం చేశారు. కమెడియన్ సత్య హీరో స్నేహితుడిగా వినోదాన్ని పంచాడు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ కనువిందు చేసింది. అది సినిమా ప్రమాణాలను పెంచేలా ఉంది. రాధన్ సంగీతంలో ఆకట్టుకునే ట్యూన్ ఒక్కటీ లేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. గ్యారీ ఎడిటింగ్ ఓకె. లిమిటెడ్ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో నిర్మాణాత్మక విలువలు అంతగా చూడలేము.
రెండు వేర్వేరు టైమ్ జోన్‌ల ఆధారంగా సినిమా తీయాలనే దర్శకుడు మల్లికార్జున్ రామ్ ఆలోచన బాగుంది. అయితే దానికి తగ్గట్లు స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో మాత్రం సఫలీకృతుడు కాలేక పోయాడు. ఫస్ట్ హాఫ్‌లో ప్రధాన జంటపై చిత్రీకరించిన సన్నివేశాలను డీసెంట్‌గా బాగానే ఉన్నాయనిపించినా… ద్వితీయార్థం మాత్రం అంత గ్రిప్పింగ్ గా అనిపించదు. దీంతో చూస్తున్న వారు అంసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.ఈ టైమ్ ట్రావెల్ చిత్రం చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు నిరాశ పడక మానరు.
ప్లాస్ పాయింట్స్
నటీనటుల పెర్ఫార్మెన్స్
కనువిందు చేసిన ఫోటోగ్రఫీ
సత్య కామెడీ
మైనస్ పాయింట్స్
నిరాశపరిచే ద్వితీయార్థం
ఆకట్టుకోని పాటలు
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: ‘అద్భుతం’ జరగలేదు