తెలంగాణలో కమలం పార్టీ తన బలాన్ని క్రమంగా పెంచుకుంటోంది. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే పలువురు కాషాయ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు.
Read Also: బీజేపీలోకి తెలంగాణ ఉద్యమ నేత జంప్ !
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఎంపీ సోయం బాబూ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. పదవులు, సీట్ల కోసం బీజేపీలో తీన్మార్ మల్లన్న చేరలేదని.. కేవలం టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో అంతమొందించేందుకు చేరారని స్పష్టం చేశారు. ప్రజల కోసం తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్న వ్యక్తి అన్నారు.
అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. చింతపండు నవీన్ ను ప్రజలు తీన్మార్ మల్లన్న చేశారని ఆయన చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని అన్నారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని మండిపడ్డారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ధ్యేయమని చెప్పారు. బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు.