ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా.. ఏదో జరుగుతోంది. రాష్ట్రం చుట్టూ కేంద్ర మంత్రులు చక్కర్లు కొడుతున్న తీరు చూస్తుంటే.. ఈ అనుమానం బలపడుతోంది. పైకి చెప్పే కారణాలు ఏవైనా సరే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు. వరసపెట్టి మంత్రులంతా ఏపీ చుట్టే ఎందుకు తిరుగుతున్నారన్నది.. జనానికీ అయోమయాన్ని కలిగిస్తోంది. దక్షిణాదిన బలపడాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆలోచనలు.. ఏపీ కేంద్రంగానే అమలు కాబోతున్నాయా అన్న చర్చ సైతం మొదలైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ నెల 7న పొందూరులో చేనేత దినోత్సవ కార్యక్రమానికీ హాజరయ్యారు. పనిలో పనిగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సరిగ్గా వారానికే.. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఓ శుభకార్యం వచ్చి వెళ్లారు. అసలే కేంద్ర మంత్రి. రాజకీయ కారణం ఏమీ లేకుండా ఉంటారా.. ఈ ప్రశ్నకు నర్సాపురం పర్యటన నుంచి సమాధానమైతే రాలేదు.
ఇక.. బీజేపీ బిగ్ షాట్. అమిత్ షా. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీశైలాన్ని ఈ నెల 12న సందర్శించారు. ఆయన అడుగు తీసి అడుగేస్తే.. ఎన్నో లెక్కలు ఎక్కాలు ఉంటాయని బీజేపీ నేతలే అంటుంటారు. అంత పెద్ద నేత.. మోడీ తర్వాత బీజేపీకి పెద్ద దిక్కు అయిన ఆయన.. ఊరికే వచ్చారని అనుకుంటే ఎలా.. అని ప్రజలు భావిస్తున్నారు. కానీ.. శ్రీశైలంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి.. తిరిగి ఆయన వెళ్లిపోయారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద దిక్కుగా మారిన కిషన్ రెడ్డి సైతం.. ఆంధ్రాను చుట్టేశారు. జన ఆశీర్వాద సభ పేరుతో.. తిరుపతిలో పర్యటించారు. విజయవాడలోనూ తిరిగారు. 18, 19 తేదీల్లో రాష్ట్రంలోనే ఉన్నారు. కీలక నేతలందరితో మంతనాలు చేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికాయి. కచ్చితంగా.. ఈ పర్యటనలో ఆయన పార్టీ శ్రేణులకు ఏదైనా కీలక దిశానిర్దేశం చేసే ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీరికి తోడు.. మరో కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 19న పర్యటించారు. సరిహద్దునే ఉన్న కర్ణాటకకు చెందిన నేత. దూకుడు కలిగిన నాయకుడు. ఆయన సైతం సైలెంట్ గా రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. ఇలా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కేంద్ర మంత్రులు చుట్టేస్తున్నారు. కారణాలు ఏవైనా సరే.. ఆగస్టులో వాళ్లే ఆంధ్రా రాజకీయాల వార్తల్లో ఒకింత ప్రాధాన్యత దక్కించుకుంటున్నారు.
కేంద్ర మంత్రులన్నాక.. కార్యక్రమాలు ఉండవా.. వాళ్లు అన్ని రాష్ట్రాలను పర్యటంచవద్దా.. అని అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ.. బీజేపీ లెక్కలు అలా ఉండవు కదా. కర్ణాటకను దాటి దక్షిణ భారతంలో బలంగా విస్తరించలేకపోతున్న తమ బలహీనతను.. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ సమీకరణాలతో కాస్త తగ్గించుకోవచ్చన్న ఆలోచనలో వాళ్లు ఉండవచ్చన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఓ వైపు.. సీఎం జగన్.. కేంద్రానికి, బీజేపీకి అనుకూలంగానే మెలుగుతున్నారనే చెప్పాలి. మరోవైపు.. గతంలో ఎన్నడూ లేనంతగా టీడీపీ బలం ప్రజల్లో తగ్గిందన్న వాస్తవాన్నీ అంగీకరించాలి. పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేన.. వారితో కలిసే నడుస్తోంది.
ఈ మూడు పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటే.. రానున్న కాలంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్న ఆలోచన బీజేపీ చేస్తుండవచ్చని.. కేంద్ర మంత్రుల పర్యటనతో అనిపిస్తోంది. ఇదే నిజమైతే.. అతి త్వరలోనే.. ఆంధ్రా వేదికగా రాజకీయ సమీకరణాలు మరింతగా మారవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.