ఆయన మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నేత. ఆ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్ కూడా. ఉన్నట్టుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న ఇంఛార్జ్ పదవిని పీకేసింది పార్టీ. కొత్త నాయకుడిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. ఎందుకీ మార్పు? మాజీ ఎమ్మెల్యే ఎందుకు రుచించలేదు?
టీడీపీ ఇంఛార్జ్ పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే తొలగింపు
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూలుతున్నాయి. కేడర్ చెల్లాచెదరవుతోంది. ఇలాంటి నియోజకవర్గాలపై టీడీపీ అధిష్ఠానం ఫోకస్ పెడుతోంది. ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉండగానే.. మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్టు టాక్. కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటిస్తున్నారు.. ఇప్పటికే ఇంఛార్జ్‌లుగా ఉన్నవారిని ఆ పదవి నుంచి పీకేసి పక్కన పెడుతున్నారు. అయితే నరసాపురం విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలను ఆశ్చర్య పరిచిందట. అక్కడ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించారు. పొత్తూరి రామరాజు అనే కొత్త నేతను ఇంఛార్జ్‌ను చేశారు.
మాధవనాయుడిపై వేటు వేయాలని ఫిర్యాదులు?
ఎన్నికల్లో ఓడినా.. నరసాపురం టీడీపీలో వర్గపోరు ఓ రేంజ్‌లో ఉందని చెబుతారు. ఆ వర్గపోరు కారణంగానే మాధవనాయుడు ఇంఛార్జ్ పదవి పోగొట్టుకున్నారనే ప్రచారం ఉంది. అయితే నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సరిగా వర్కవుట్ చేయలేదని కేడర్ గుర్రుగా ఉందట. టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించకపోవడానికి ఆయనే కారణమని విమర్శలు చేశారట. మాధవ నాయుడు వల్లే కేడర్ చెదిరిపోయిందని నరసాపురం పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి, మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. స్థానికంగా ఉన్న పరిస్థితులను టీడీపీ పెద్దలకు చెప్పాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని కూడా కోరారట. ఈ కారణాల వల్లే మాధవ నాయుడిపై వేటు పడిందని ప్రచారం జరుగుతోంది.
బీజేపీలోకి వెళ్తారనే వేటు వేశారా?
మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నరసాపురంలో మరో చర్చ కూడా మొదలైందట. మాధవనాయుడు టీడీపీలో చేరకముందు బీజేపీతో సన్నిహితంగా ఉండేవారట. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు శిష్యుడిగా చెబుతున్నారు. ఆ పరిచయాల వల్ల ఇప్పుడు మాధవ నాయుడు బీజేపీవైపు అడుగులు వేసే అవకాశం ఉందని టాక్. అందుకే ముందే టీడీపీ మేల్కొని ఇంచార్జ్ పదవి నుంచి తప్పించిందని విశ్లేషించే వారూ ఉన్నారు.
ఆర్థికంగా దెబ్బతినడం వల్లే ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించమన్నారా?
ఈ ప్రచారాలను మాధవనాయుడు వర్గం కొట్టిపారేస్తోంది. ఆయన ఆర్థికంగా చితికిపోయారని.. అందువల్లే ఇంచార్జ్ పదవి నుంచి తప్పించాలని రెండేళ్లుగా టీడీపీ పెద్దలను కోరుతున్నారని చెబుతున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకే ఇంఛార్జ్‌ను మార్చారన్నది మాజీ ఎమ్మెల్యే అనుచరులు మాట. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఒక మాజీ ఎమ్మెల్యేను సడెన్‌గా పదవి నుంచి సాగనంపడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. ఈ పరిణామాలపై మాధవనాయుడు పెదవి విప్పడం లేదు. నిజంగా ఆర్థికంగా చితికిపోయి పదవి వొద్దన్నారో లేక మరో పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉండటం వల్లే వేటు పడిందో కాలమే చెప్పాలి.