ఆయన మంత్రిగా.. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదట. క్యాడర్ ఆయన్ను కలవాలన్నా అమరావతి.. లేకపోతే క్యాంప్ ఆఫీస్ అనేలా ఉండేది పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి అదే కారణమట. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పోయినచోటే వెతుక్కోవాలని చూస్తున్నారు. పనిలో పనిగా కుమారుడిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు ఫార్ములాలు వర్కవుట్ చేసే పనిలో ఉన్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం.
రాజకీయంగా దూకుడు పెంచిన కళా వెంకట్రావు
కళా వెంకట్రావ్. ఉత్తరాంధ్రతోపాటు ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. అయితేనేం మొన్నటి ఎన్నికల్లో ఆయన సీనియారిటీ ఓడిపోయింది. ఎచ్చెర్ల నుంచి రెండోసారి బరిలో దిగి నెగ్గలేకపోయారు. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత కోవిడ్ ఉధృతి పెరగడంతో అడపా దడపా టీడీపీ పిలుపు మేరకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారు కూడా. ఆ విధంగా నేనూ పొలిటికల్ ఫ్రేమ్‌లోనే ఉన్నానని అప్పుడప్పుడూ గుర్తుచేస్తూ వచ్చారు కళా. ఇప్పుడు ఒక్కసారిగా దూకుడు పెంచారు.
కొడుకు ప్రమోషన్ కోసం జనంలో తిరుగుతున్నారా?
మంత్రిగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ ఎక్కువ కాలం అమరావతిలోనే గడిపారు కళా వెంకట్రావు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎచ్చెర్ల పై పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. ఇంకా అలాగే ఉంటే రాజకీయంగా ఉనికి లేకుండా పోతామని గ్రహించారట కళా. పైగా వయోభారం దీంతో వారసుడిని లైన్‌లోకి తేవడానికి ప్లాన్ చేశారు. పలకరింపులోనే సీనియారిటీ చూపించే వెంకట్రావు ఇప్పుడు పూర్తిగా మారారట. కొడుకు ప్రమోషన్ కోసం అన్నీ వదిలేసి జనంలో తిరుగుతున్నారట.
అందుబాటులో ఉన్నాననే ఫీలింగ్ కల్పిస్తున్నారా?
పార్టీ కార్యక్రమం.. పలకరింపులు.. పరామర్శలు ఏవైనా నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ కార్యకర్తలతో టచ్‌లోకి వెళ్తున్నారు కళా వెంకట్రావు. గతంలో తాను కొంత నిర్లక్ష్యం చేయడం వల్లే ఎచ్చెర్లలో నెగ్గలేకపోయానని రియలైజ్ అవుతున్నారట. వరుసపెట్టి ఒక్కో ప్రాంతాన్నీ చుట్టేస్తూ అటు పార్టీని.. ఇటు క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉన్నాననే ఫీలింగ్ కలిగిస్తున్నారట. దీనికి కేడర్ సైతం సంతోషం వ్యక్తం చేస్తోంది.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కళా తనయుడు!
టీడీపీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుండటంతో తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడిని లైమ్‌లైట్లోకి తీసుకొచే పనిలో ఉన్నారు వెంకట్రావు. ఇన్నాళ్లూ రామ్ తీరు తండ్రి చాటు కొడుకు అన్నట్టే ఉండేదట. ఇప్పుడు కుమారుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉండటంతో పార్టీ మెలుకువలు.. కిటుకులు.. రాజకీయ ఎత్తుగడల్లో తర్ఫీదు ఇస్తున్నారట. తండ్రి శిక్షణలో తనయుడు గాడిలో పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కార్యకర్తలను కలిసి మాట్లాడటంతోపాటు సమావేశాలు పెడుతున్నారట. మండలస్థాయి నేతలు.. చిన్న కేడర్ అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తూ.. కలుపుకొని వెళ్తున్నారట. మొత్తానికి స్వామికార్యం.. స్వకార్యం రెండూ ఒకేసారి నెరవేరేలా కళా వేస్తున్న ఎత్తుగడలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.