ఒకరు చేతికి ఉంగరం పెట్టుకున్నారు. ఇంకొకరు కనిపించిన దేవుడికి మొక్కుతున్నారు. ఏకంగా గుడే కట్టించేశారు మరొకరు. వీటన్నింటికీ మూల మంత్రం ఒక్కటే. రేస్‌లో ముందుకెళ్లడమే. కొత్త పదవి చేపట్టడం.. లేదా ఉన్న పదవిని కాపాడుకోవడం. ఆ జిల్లాలో అధికారపక్ష నేతలు చేస్తున్న ఈ విన్యాసాలే ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం?
దేవుడు కరుణించాలి. వరాలు కురిపించాలి. సామాన్య భక్తులు ఈ ఆశతోనే గుళ్లకు వెళ్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. రాజకీయ నాయకులైతే అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని ఎదురు చూస్తారు. అధినేత చల్లని చూపు పడితే.. పంట పండినట్టు భావిస్తారు నేతలు. ఇక అధికారంలో ఉన్న పార్టీ నేతలైతే చేయని విన్యాసాలు ఉండవు. చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇలాంటి విన్యాసాలతోనే పోటీ పడి రాజకీయన్ని రక్తి కట్టిస్తున్నారు. సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకుంటే మంత్రి పదవి గ్యారెంటీ అని భావించి కొత్త పోకడలను ఏపీ రాజకీయాలకు పరిచయం చేస్తున్నారు.
సీఎం జగన్ ఫొటో ఉన్న ఉంగరం పెట్టుకున్న నారాయణస్వామి
మంత్రి పదవి కోసం ఆలయలు చుట్టేస్తున్న రోజా!
జిల్లాకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు రోజా, బియ్యపు మధుసూదన్‌రెడ్డిలు తమలోని కళను బయటకు తీసి ఓ రేంజ్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు తరహాలో సీఎం జగన్ ఫొటో కలిగిన ఉంగరాన్ని పెట్టుకున్ని వైసీపీలో చర్చకు తెరతీశారు నారాయణస్వామి. రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాళనలో తన మంత్రి పదవి పోకుండా ఆయన రింగ్‌ను నమ్ముకున్నారు. ఆ ఉంగరం ఏ మేరకు డిప్యూటీ సీఎంకు కలిసి వస్తుందో ఏమో? ఎమ్మెల్యే రోజా మాత్రం కేబినెట్‌లో చోటు కోసం.. ప్రముఖ ఆలయాలను ఏకబిగిన చుట్టేస్తున్నారు. కనిపించిన దేవుడికి మొక్కుతున్నారు. మంత్రి రోజా అని అనిపించుకోవడమే జీవితాశయంగా పూజలు చేస్తున్నారు ఈ ఫైర్‌బ్రాండ్.
రూ.3 కోట్లతో సీఎం జగన్‌కు గుడి కట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే!
నారాయణస్వామి, రోజాల కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివేనంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి. ఆయన కూడా తమిళ పద్ధతినే ఎంచుకుని.. అధినేతకు ఏకంగా గుడి కట్టించేశారు. ఇదే ఆ జగనన్న నవరత్నాల ఆలయం. ఈ గుడిని కట్టడానికి జస్ట్ 3 కోట్లే ఖర్చుపెట్టారట ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి. జగనన్న కాలనీలో ఇళ్ల పథకం కింద 2 వేల మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించిన స్థలంలోనే ఈ ఆలయం కట్టించారు ఎమ్మెల్యే. ప్రారంభోత్సవం కూడా అట్టహాసంగా నిర్వహించారయన.
టాక్ ఆఫ్ ది టౌన్‌గా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే!
ఇదంతా సీఎం జగన్‌పై అభిమానంతో చేస్తున్న పనులుగా ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చెబుతున్నా.. మంత్రి పదవికోసం పెద్ద కర్చీఫే వేశారని పార్టీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. ఈ గుడిని నిర్మించడం ద్వారా వైసీపీలో.. చిత్తూరుజిల్లా పార్టీ వర్గాల్లో ప్రస్తుతం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. కేబినెట్ ప్రక్షాళన సమయం దగ్గర పడే కొద్దీ చిత్ర విచిత్ర విన్యాసాలు చేయడంతో చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. మరి.. ఉంగరాలు.. పూజలు.. గుడులు వైసీపీ నేతలకు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.