మొన్నటి ఎన్నికల సమయంలో ఆ నేతలిద్దరి ప్రచారానికి.. పరస్పర ఆరోపణలకు సోషల్ మీడియా మంచి వేదికైంది. పైసా ఖర్చులేని వ్యవహారం కావడంతో కేడర్, అభిమానులు ఏ పోస్టులు పెట్టినా గో ఏ హెడ్ అన్నారట ఆ ఇద్దరు. కట్‌చేస్తే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు మరీ శ్రుతిమించిపోతున్నాయట. దీంతో ఒకప్పుడు సంబరపడిన నేతలే ఇప్పుడు ఆ సోషల్ మీడియా పోస్టులకు ఫీలవుతున్నారట. ఇంతకీ నేతలకు సోషల్ మీడియా తెచ్చిన తలనొప్పులేంటి?
ఇద్దరికీ ఎన్నికల్లో ఉపయోగపడ్డ సోషల్ మీడియా!
సిక్కోలు జిల్లాలో ట్రెండింగ్ పాలిట్రిక్స్‌కు కేరాఫ్ అడ్రసైన పలాసలో సోషల్ మీడియా పోస్టింగ్‌లు ఓ రేంజ్‌లో రచ్చచేస్తున్నాయి. ఇటీవలకాలంలో జిల్లా రాజకీయమంతా పలాస కేంద్రంగానే నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం రచ్చకెక్కడంతో ముఖ్యనేతలు ఏం చేయాలో తెలియక తలలు బాదుకుంటున్నారట. 2019 ఎన్నికల్లో పలాసలో టీడీపీ నుంచి సీనియర్ నేత గౌతు శివాజీ కుమార్తె శిరీష.. వైసీపీ నుంచి డాక్టర్ సీదిరి అప్పలరాజు తొలిసారి బరిలోకి దిగారు. అప్పలరాజు తొలిప్రయత్నంలోనే ఎమ్మెల్యే గెలిచి.. ఏడాది తిరగకుండానే మంత్రి అయ్యారు. సభలు.. సమావేశాలు.. ర్యాలీలు ఎన్ని చేసినా.. ఎన్నికల్లో సోషల్ మీడియా అప్పలరాజు.. శిరీషలకు బాగానే ఉపయోగపడింది. ఎన్నికల తర్వాత కూడా సోషల్ మీడియా యాక్టివిటీస్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆర్నెళ్లుగా సోషల్ మీడియాలో ఈ ఇద్దరు నేతల అనుచరులు పెట్టుకుంటున్న పోస్టింగ్‌లు పరిధి దాటిపోతున్నాయట.
ఫేస్‌బుక్‌లో నేతల అనుచరుల మాటలయుద్ధం!
ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లు విశాఖకు మకాం మార్చేసిన గౌతు శిరీష.. ఆరు నెలల నుంచి తిరిగి యాక్టివ్ అయ్యారు. గతేడాది మత్స్యకార భరోసాలో అవినీతి జరుగుతోందని మంత్రిని టార్గెట్ చేస్తూ శిరీష ధర్నాలు చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మంత్రి అప్పలరాజు ఫాలోవర్స్ శిరీషపై గురిపెట్టారు. ఫేస్‌బుక్‌లో మాటలయుద్ధం మొదలుపెట్టారు.
పోస్టింగ్‌లు కించపరిచేలా ఉన్నాయని పోలీసులకు శిరీష ఫిర్యాదు!
హద్దులు దాటిపోతున్న అనుచరుల ఫేస్‌బుక్ వార్!
వైసీపీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు తనను కించపరిచేలా ఉన్నాయంటూ అప్పట్లో గౌతు శిరీష కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళను అని కూడా చూడకుండా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినప్పటికీ వైసీపీ ఫాలోవర్స్ సామాజిక మాధ్యమాల్లో ఇంకా రెచ్చిపోతుండటంతో శిరీషకు మద్దతుగా టీడీపీ ఫాలోవర్స్.. సోషల్ మీడియా వింగ్ కూడా ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇవ్వడం మొదలెట్టాయట. ఇలా నేతలతో సంబంధం.. వారి ప్రమేయం లేకుండానే సాగిపోతున్న ఫేస్‌బుక్ వార్ హద్దులు దాటిపోతోంది. విమర్శలు.. తిట్లు.. ఆరోపణలు దాటుకుని వ్యక్తిగత వ్యవహారాలను సైతం బజారుకీడ్చేలా పోస్టింగ్‌లు పెడుతున్నారట.
రెండు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు
నేతలకు తలబొప్పి కడుతున్న పోస్టింగ్‌లు!
గౌతు శిరీషను వైసీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ టార్గెట్ చేస్తే.. మంత్రి అప్పలరాజుతోపాటు ఆయన సతీమణిని సైతం టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మాధ్యమాలను దాటి పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో రెండుపార్టీల తరఫున ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులన్నీ ఇంటిగుట్టును వీధిన పడేసేలా ఉండటంతో.. మొన్నటి వరకూ సంబరపడిన నేతలే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నా.. కట్టడి చేయకుండా చూస్తూ ఎంజాయ్ చేసిన మంత్రికి.. టీడీపీ నేత శిరీషకు తాజాగా ఫేస్‌బుక్ పోస్టింగ్‌లు తల బొప్పికట్టేలా చేస్తున్నాయట. దీంతో అప్పుడు వారించలేదు … ఇప్పుడు వద్దన్నా ప్రయోజనం లేదు.. ఏం చేయాలిరా సామీ అని ఆంతరంగీకుల దగ్గర తెగ ఫీలైపోతున్నారట ఇద్దరు నాయకులు.