మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు 40 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారి సంఖ్య కూడా 47 శాతానికి చేరింది. ముఖ్యంగా 15-25 ఏళ్ల మధ్య వయసు వారు నెట్ ఎక్కువగా వాడుతున్నారని సర్వే తెలిపింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఇంటర్నెట్ వాడుతున్న వారు 2019లో 19 శాతం మాత్రమే ఉండగా… 2021 నాటికి 47 శాతానికి పెరిగింది. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారిలో ఢిల్లీలో 72 శాతం మంది ఉండగా… మహారాష్ట్రలో 55 శాతం మంది, తమిళనాడులో 53 శాతం మంది, అసోంలో 37 శాతం మంది ఉన్నారు.
దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకందారులు, ఇంటర్నెట్ వాడుతున్న వారిపై లెర్నింగ్ ఇనిషియేట్స్ ఇన్ రీఫామ్స్ ఫర్ నెట్‌వర్క్ ఏకనామిస్ ఏసియా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఇందులో భాగంగా 7వేల మంది నుంచి వివరాలు సేకరించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఒక్క 2020-21 ఏడాదిలో 13.2 కోట్ల మంది ఆన్‌లైన్‌లోకి వచ్చినట్లు స్పష్టమైంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో 57 శాతం మంది పురుషులు ఉండగా.. 36 శాతం మంది మహిళలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం 55 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతానికి పరిమితమైంది.
Read Also: రిక్షా కార్మికుడికి జాక్‌పాట్… రూ.కోటి దానం చేసిన వృద్ధురాలు
అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య తగ్గుతోంది. ఉన్నత విద్య చదివిన వారిలో 89 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఉద్యోగం ఉన్న వారిలో 54 శాతం మంది, నిరుద్యోగుల్లో 44 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఒకటో తరగతి వారు 11 శాతం, రెండో తరగతి వారు 14 శాతం, మూడో తరగతి వారు 18 శాతం, నాలుగో తరగతి వారు 17 శాతం, ఐదో తరగతి వారు 15 శాతం, ఆరో తరగతి వారు 23 శాతం, 7, 8 తరగతుల వారు 20 శాతం, 9వ తరగతి వారు 21 శాతం, పదో తరగతి వారు 26 శాతం, 11వ తరగతి వారు 33 శాతం, 12వ తరగతి వారు 29 శాతం మందికి ఆన్‌లైన్ విద్యను అభ్యసించారు.