టీమిండియా హిట్ మ్యాన్ సాధించిన ఓ రికార్డు నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. నవంబర్ 13, 2014న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు సాధించాడు. సాధారణంగా వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం 264 పరుగులు చేయడం మాములు విషయం కాదు. అలాంటిది ఒక్క ఆటగాడే అంత స్కోరు చేశాడంటే అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగి ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుందనే మాట నిజం.
Read Also: జట్టు ఎంపికలో మేము భాగస్వామ్యం కాలేదు: రవిశాస్త్రి
అయితే రోహిత్ అలా చెలరేగిపోవడానికి అదృష్టం కూడా కలిసివచ్చింది. నాలుగు పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను తిసార పెరీరా వదిలిపెట్టాడు. ఇక ఆ తర్వాత హిట్ మ్యాన్ షో మొదలైంది. ఏ బౌలర్‌ను వదిలిపెట్టకుండా ఉతికేశాడు. 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. తర్వాత 51 బంతుల్లోనే మరో 100 పరుగులు జోడించాడు. దీంతో 151 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 200 పరుగులు చేసిన తర్వాత కేవలం 15 బంతుల్లోనే 250కి చేరుకున్నాడు. 264 పరుగులు చేసిన తర్వాత ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ అవుటయ్యాడు. హిట్ మ్యాన్ వీరబాదుడి కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేయగా… శ్రీలంక 251 పరుగులకే ఆలౌటైంది. అయితే ఏడేళ్లు పూర్తయినా రోహిత్ రికార్డు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం.