పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు.. కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో.. నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. ఇక, పర్యాటక కేంద్రమైన విశాఖలోనూ కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.. రాత్రి 8 గంటల నుంచి అన్ని బీచ్‌లు మూసివేయనున్నారు.. రాత్రి 8 గంటల నుంచి ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం బీచ్, సాగర్‌నగర్ బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్, యారాడ బీచ్‌లకు సందర్శకులకు, వాహనాల రాకపోకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.. ఇక, రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ఎన్‌సీబీ (నేవల్ కోస్టల్ బ్యాటరీ) నుంచి భీమిలి వరకు బీచ్‌రోడ్డులో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు.
Read Also: ఆనందయ్య కరోనా మందు పంపిణీపై మళ్లీ ఉత్కంఠ
మరోవైపు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీఆర్‌టీఎస్ రోడ్డు హనుమంతవాక నుంచి అడవివరం కూడలి, గోశాల కూడలి నుంచి వేపగుంట కూడలి, పెందుర్తి కూడలి నుంచి ఎన్‌ఏడీ కూడలి మీదుగా కాన్వెంట్ కూడలి వరకు మధ్యలైను మూసివేయనున్నారు.. అత్యవసర వాహనాలు సర్వీసు రోడ్డు మీదుగా ప్రయాణించాలని ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ తెలిపారు.. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మద్దిలపాలెం కూడలి నుంచి రామాటాకీస్ వరకు ఉన్న బీఆర్‌టీఎస్ మధ్యలైను, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అండర్ పాస్ రహదారిలో రాకపోకలు నిషేధించారు. రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, దుకాణాలు ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి కేటాయించిన సమయం వరకే పరిమితం అవ్వాలని స్పష్టం చేశారు.. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులపై ఎలాంటి వేడుకలు జరపకూడదని.. ద్విచక్రవాహనదారులు అతివేగంగా వెళ్లినా… అధిక శబ్దాలను కలిగించినా చర్యలుంతప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.