కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో జానారెడ్డి ఒకరు. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ఆపార్టీని ధిక్కరించిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆయనకు ఏదో ఒక మంత్రి పదవీ దక్కేది. అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన రికార్డు సైతం జానారెడ్డి పేరు పైనే ఉంది. తెలంగాణ కోసం పోరాడిన నేతగానూ ప్రజల్లో ఆయనకు గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అన్న రేంజులో ప్రచారం జరిగింది.
అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణ ప్రజలు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు జై కొట్టడంతో కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ సమయంలో విపక్ష నేతగా జానారెడ్డి కీలక పాత్ర పోషించారు. కాగా టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటికీ భారీ షాకిచ్చింది. ముందస్తు ఎన్నికల్లో జానారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహాయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. వరుసగా రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారానికి దూరమవడంతో ఆపార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది.
ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మృతిచెందారు. ఆయన మరణంతో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జనారెడ్డి పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహాయ్య కుమారుడు భగత్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జానారెడ్డి గెలుస్తాడని అంతా భావించినా టీఆర్ఎస్ కు సానుభూతి పవనాలు కలిసి వచ్చాయి. దీంతో వరుసగా జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని జానారెడ్డి ఇకపై తాను పోటీ చేయనంటూ ప్రకటించారు.
ఇదిలా ఉంటే నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక ముందు జానారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం భారీగా సాగింది. అయితే తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ లో యువ నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే జానారెడ్డి మాత్రం మునుపటిలా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. కాంగ్రెస్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ చేసే ఏ కార్యక్రమానికి కూడా పిలుపు అందడం లేదని తెలుస్తోంది.
ఈనేపథ్యంలోనే ఆయన టీఆర్ఎస్ గూటికి చేరుతారనే ప్రచారం మరోసారి తెరపైకి వస్తోంది. గతంలోనే జానారెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ లో చేరాలని ఒత్తిడి చేశారు. అయితే అప్పుడు జానారెడ్డి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటర్లు ఆయనకు భారీ షాకిచ్చారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కూడా ఆయన లేదని తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే జనారెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులు రోజురోజుకు ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. టీఆర్ఎస్ లో చేరితే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయనకు నచ్చజెబుతున్నారు. కాంగ్రెస్ ను వీడాలని ఆయనకు లేకున్నా కుటుంబ సభ్యుల కోరిక మేరకు జానారెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని టాక్ విన్పిస్తోంది. సీఎం కేసీఆర్ తనకు స్పష్టమైన హామీ ఇస్తే ఆయన ఏ సమయంలోనైనా టీఆర్ఎస్ చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరీ జానారెడ్డికి టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ లభిస్తుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.