తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా గెలిచినందుకు సదరు లేఖలో కవితకు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి నాయకురాలిగా ఇనుమడించిన కీర్తిని గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నా’ అంటూ రామోజీరావు తన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 12 స్థానాలకు టీఆర్ఎస్ తన అభ్యర్థులను నిలబెట్టింది. నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి బలం ఉండటంతో సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. అయితే ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఎన్నిక జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తాయి. చివరకు ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు పోటీచేయలేదు.