రాజకీయంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. వచ్చే ఏడాది ఇక్కడ ఎన్నికలు జరగున్నాయి. దశాబ్దాల పాటు యూపీని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ నామ మాత్రంగా మిగిలిపోయింది. కానీ గాంధీ-నెహ్రూ కుటుంబం అంటే ఇప్పటికీ యూపీ ప్రజలలోఎంతో కొంత గౌరవం..పలుకుబడి మిగిలే వుంది. అయితే కులాల వారిగా ఓట్లు చీలిపోవటంతో హస్తం పార్టీకి అవకాశం లేకుండా పోతోంది. మూడు దశాబ్దాల నుంచి అంతకంతకు పడిపోతున్న పార్టీ ప్రతిష్టను పెంచే బాధ్యతను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె తన ఫోకస్ అంతా యూపీ మీదే పెట్టారు. అంది వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని ఇరుకున పెట్టే ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతుండటంతో ప్రియాంక గాంధీ చెలరేగి పోతున్నారు. యోగీ హయాంలో జరిగిన పలు పరిణామాలపై నిరసనలు తెలిపిన ప్రియాంక తాజాగా లఖీంపూర్ ఖేరీ ఘటనలో సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లి నలుగురి ప్రాణాలు తీసిన ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. దీనిపై ఆమె పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అరెస్టు కూడా అయ్యారు. యూపీ పోలీసులుఆమెను గృహనిర్బంధంలో పెట్టారు.
తాజా పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమెను ప్రజలు ఓ సీజనల్ పొలిటీషియన్ మాత్రమే చూశారు. ఐతే ఇప్పుడు ఆమె నిరంతరం ప్రజల మధ్య ఉండి ఆ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు లఖంపూర్ ఖేర్ ఘటన ఆమెకు కలిసొచ్చింది. ప్రియాంక ఉగ్రరూపం చూస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది.
గత కొన్నేళ్లుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతోంది. సమర్ధుడైన నేత లేని కొరత ఆ పార్టీని పీడిస్తోంది. రాహుల్ గాంధీ ఉన్నా బీజేపీ ఎదురుదాడికి నిలవలేకపోతున్నారనే భావన ప్రజల్లో ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీకి ఏనాటికైనా ప్రియాంకయే కరెక్టనే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆమె స్పీడ్ చూస్తుంటే ఆమె ఫుల్‌టైం లీడర్‌గా మారుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. లఖీంపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆమె దూసుకెళ్లటం..ఆపై ఆరెస్టు కావటం ఆమె నానమ్మ ఇందిరను తలపిస్తున్నారు. 44 ఏళ్ల క్రితం 1977,అక్టోబర్ 3న అప్పటి జనతా ప్రభుత్వం ఇందిరను అరెస్టు చేసింది. సరిగ్గా అదే రోజున ఇప్పుడు ప్రియాంకను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇది బీజేపీ పతనానికి నాంది అంటూ దీనికి కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై పెద్ద ఎత్తునన ప్రచారం కల్పిస్తోంది.
మరోవైపు ఈ ఘటనలో ఆమె ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ మాటల యుద్ధానికి తెర తీశారు. లఖింపూర్ ఖేర్ మీరు లఖింపూర్ ఖేర్ వెళ్తారా ? అంటూ మోడీకి సవాలు విసిరారు. ఎటువంటి ఆదేశం లేకుండా ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నారు, కానీ భయంకర నేరానికి పాల్పడిన కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రియాంక ప్రశ్నించారు.
దేశంలోనే అత్యధిక లోక్ సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పీఠానికి రహదారి లాంటిది. వచ్చే ఏడాది ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ తన సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె సారధ్యంలోనే కాంగ్రెస్ ఒంటరిగా యూపీ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. 2017లో ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. 403 సీట్లకు గాను 312 చోట్ల గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్‌సమాజ్ పార్టీ 19 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్‌కు ఏడంటే ఏడు సీట్లు మాత్రమే దక్కాయి.
మరోవైపు, లఖింపూర్ ఖేరి వ్యవహారం అటు తిరిగి ..ఇటు తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంది. ఎనిమిది మంది మరణానికి కారణమైన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చటాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలపై కేసు కూడా రిజిస్టర్ చేశారు. అలాగే ప్రియాంక అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని కూడా కేసు పెట్టారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసే కుట్ర కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.