సీజన్ తో సంబంధం లేకుండా.. భక్త జన ప్రవాహం కనిపించే ఆలయాల్లో.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. కొన్ని రోజుల క్రితం వరకూ… ఆలయం లోపలి వ్యవహారాలు వివాదాస్పదమైన విషయం చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఆలయం వెలుపల జరుగుతున్న ఓ వ్యవహారం.. భక్తులకు ఇబ్బందికరంగా మారుతోంది. అమరావతిని రాజధానిగా గుర్తించిన తర్వాత మొదలైన ఈ వ్యవహారం.. ఇటీవల మరింత పెరిగి.. భక్తులకు సమస్యలు పెంచుతోంది.
ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే.. దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం విజయవాడలోనే ఉంది. ఆ కార్యాలయం కోసం కనకదుర్గమ్మ సత్రం.. జమ్మిదొడ్డి భవనాలను వాడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేని కారణంగా.. ఇదే భవనాన్ని వినియోగిస్తున్నారు. అలాగే.. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి సైతం ఇక్కడ ఏడాదిన్నరగా ఆలయ సత్రాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం.
ఇంతే కాదు.. జమ్మిదొడ్డి సత్రంలోని కొన్ని గదులను సూట్ రూమ్ లుగా మార్చారు. రెండు నెలల కిందట రాష్ట్రంలోని ఓ ప్రముఖ ఆలయం నుంచి వచ్చిన కొందరు.. ఆలయానికి చెందిన గదులు తీసుకుని ఉంటున్నారట. రోజుకు 2 వేల రూపాయలు విలువ చేసే గదులు వాడుతున్నారట. వాటి కారణంగా.. ఆలయానికి ఆదాయం వృథా అవడమే కాదు.. రద్దీ వేళల్లో భక్తులకు వసతి సైతం కష్టంగా మారుతోందని కొందరు అంటున్నారు.
ఇతర రాజకీయ నేతలు సైతం కీలక సందర్భాల్లో.. పండగల వేళల్లో ఇలాగే వ్యవహరిస్తున్న తీరుతో.. సామాన్య భక్తులు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటున్నాయి. విజయవాడలో మరో అవకాశం లేకే.. ఆలయ భవనాలు వాడాల్సి వస్తోందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా.. దేవాదాయ శాఖ కానీ.. ఉన్నతాధికారులు కానీ.. మరో ఏర్పాటు చేస్తే.. భక్తుల సమస్య తీరుతుందన్న వాదన వినిపిస్తోంది.
ఈ సమస్యను.. కనకదుర్గమ్మ ఎలా పరిష్కరిస్తుందో.. తన భక్తులకు సరైన వసతి ఎప్పుడు అందేలా ఆశీర్వదిస్తుందో.. అంతా.. రాష్ట్ర ప్రభుత్వానికే ఎరుక.. అని కొందరు భక్తులు నిట్టూరుస్తున్నారు.