విజయనగరం జిల్లాలో చెరుకు రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. అయితే, పోలీసుల అడ్డంకులు కొనసాగుతున్నాయి. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, అసలు రైతులు తగినంత చెరకు పండించడం లేదంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి మాటలను ఖండిస్తూ నేడు మహాపాదయాత్రకు పిలుపునిచ్చారు రైతులు.
భీమసింగి సహకార చక్కెర కర్మాగారం నుండి కలెక్టరేట్ వరకూ మహాపాదయాత్ర చేపడుతున్నారు రైతులు. రైతులకు నాయకత్వం వహిస్తున్న తమ్మినేని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 10గంటల నుంచే కెఎల్ పురంలోని ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు పోలీసులు. జామి మండలం అలమండకు చెందిన సింగంపల్లి బంగారయ్య, దొండపర్తికి చెందిన వేండ్రాపు నాయుడు బాబును తెల్లవారుజామున బలవంతంగా లాక్కెళ్ళి జామి పోలీస్ స్టేషన్ లో నిర్భంధించారు పోలీసులు
పాదయాత్ర చేపడుతున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ ను అరెస్ట్ చేసి జామి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మరికొంతమంది రైతులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు వలయం నుండి తప్పించుకొని పాదయాత్ర చేపడుతున్న మరికొంతమంది రైతులు. రైతులను అడ్డుకుంటున్న పోలీసులతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా జామి మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు రైతులు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.