విజయవాడలోని జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల జనసేన అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని.. వీటి మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారని పవన్ పేర్కొన్నారు.
Read Also: తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచాలి: టీఆర్ఎస్ నేత వినోద్
ఏపీలో సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది జనసేన పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము ప్రజల పక్షాన ఉన్నామని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలో ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నామని పవన్ చెప్పారు. జిల్లాకు వెళ్ళినప్పుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ శ్రేణులను కలుపుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను ప్రభావవంతంగా నిర్వహించాలన్నారు. త్వరలో మండల అధ్యక్షులు, కమిటీల నియామకం ఉంటుందని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలోకి నిలపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.