నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ సినిమా విడుదల విషయంలో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. “చిత్రపరిశ్రమ అంటే ఒక్క దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు కాదు.. చాలామంది ఉన్నారు. ఈ మధ్య నాని గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే… అక్రమాలు, అన్యాయాలు ఏం చేయలేదు అతను. ఒక సినిమా చేసుకుని విడుదల చేయడానికి థియేటర్లు లేక గత్యంత్యరం లేని పరిస్థితుల్లో ఓటిటికి వెళ్తే… థియేటర్ యజమానులు అంతా ఆ అబ్బాయి మీద పడితే అతనేం చేస్తాడు. మీరు వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి తప్పేం ఉంది?” అంటూ ప్రశ్నించారు.
Read also : సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్
‘టక్ జగదీష్’ను ఓటిటిలో విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి ప్రెస్ మీట్లు పెట్టారు. నాని మీద థియేటర్ యజమానులంతా కలిసి ఇంతెత్తున లేస్తూ ఇకపై నాని సినిమాలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. అందరూ కలిసి నానిని టార్గెట్ చేశారు. పలు సినిమాలు ఓటిటిలో విడుదలైనా నోరు మెదపని వీరు నానిపై ఇలా మండిపడుతుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇంత తతంగం జరుగుతున్నా తమకేమీ పట్టనట్టుగానే ఉన్నారు. నాని చిత్రబృందం మాత్రం స్పందించి ఓటిటిలో సినిమాను విడుదల చేయడం నానికి ఇష్టం లేదని, కానీ తామే తప్పక ఆయన్ని ఒప్పించి విడుదల చేస్తున్నామని ప్రకటించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు శాంతించి నానికి సారీ చెప్పారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాని స్పందిస్తూ తనపై ఇలా అనవసరంగా నోరు పారేసుకున్న వారికి సైలెంట్ గానే సమాధానం చెప్పాడు. ‘నా సినిమాలను నేనే బ్యాన్ చేసుకుంటా… ఒకవేళ పరిస్థితులు అన్నీ బాగుండి కూడా నా సినిమా ఓటిటిలో రిలీజ్ అయినప్పుడు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక ‘నేనూ ఇండస్ట్రీలో ఒకడినే… కానీ ఇలా అందరూ కలిసి నన్ను వేరు చేయడం బాధగా ఉంది’ అంటూ సినీ పెద్దల వ్యవహారంపై ఆవేదనను వెలిబుచ్చాడు.