యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు దాడిని పెంచాయి. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసు ఎస్కార్ట్‌లో హత్య చేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వి యాదవ్ ఈ రోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది శాంతిభద్రతల వైఫల్యమని పేర్కొన్న నితీష్ కుమార్, నేరస్థులను చంపడం ఎప్పటికీ పరిష్కారం కాదని, వారిని చంపిన తీరు తనను బాధించిందని అన్నారు.
తేజస్వి యాదవ్ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. నేరాలను నిర్మూలించడం అంటే నేరస్తులను చంపడం కాదు, న్యాయస్థానం న్యాయం అందించడానికి ఉంది అని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. వారి భద్రతను పోలీసులు చూసుకోవాలన్నారు. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్న సమయంలో వారిని పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపడం విచారకరమని ఆయన అన్నారు. గ్యాంగ్‌స్టర్, అతని సోదరుడిని చంపడం “స్క్రిప్ట్” గా అనిపించిందని తేజస్వీ పేర్కొన్నారు. ఒక ప్రధానమంత్రి (రాజీవ్ గాంధీ) హంతకులపై కూడా కోర్టు విచారణ జరిగిందని గుర్తు చేశారు.
Also Read:Minister KTR: బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్.. మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అరాచకత్వం, శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పోలీసులు, మీడియా కంట పడకుండా నేరస్తులు ఇప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు స్థానం లేదని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం జంగల్ రాజ్‌లో ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు చేయాలన్నారు.
Also Read:Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు.. సీబీఐ ఎంక్వైరీ చేయాలని…
శనివారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌లో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు వ్యక్తులు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్ కొడుకు అసద్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతిక్, అష్రఫ్‌లను కాల్చి చంపిన ముగ్గురు వ్యక్తులు లవ్లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యలను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ హత్యలపై రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీని యోగి ఆదిత్యనాథ్ కోరారు. అతిక్ అహ్మద్‌పై హత్య, కిడ్నాప్ప దోపిడీతో సహా 100కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇటీవల కిడ్నాప్ కేసులో జీవిత ఖైదు పడింది.