తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతుండటంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లుగా హూజూరాబాద్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ కు ఇంకా 13రోజులు ఉన్నాయి. అయితే 72గంటల ముందే స్థానికేతరులు హుజూరాబాద్ ను వీడాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేస్తోంది.
ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే హుజూరాబాద్ లో స్ఠానికేతరులైన స్టార్ క్యాంపెయిన్ల ప్రచారం పట్టుమని పదిరోజులు ఉండనుంది. దీనిని సద్వినియోగం చేసుకోనేలా స్టార్ క్యాంపెనర్లంతా హుజూరాబాద్‌లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ పదిరోజుల్లోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేలా హామీలిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. గడిచిన ఐదు నెలలుగా హూజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్న స్థానికేతరులు ఇటీవల దసరా పండుగ రావడంతో సొంత ఊళ్లకు వెళ్లారు. ఆదివారం నాటికి వారంతా తిరిగి రావడంతో మళ్లీ హుజూరాబాద్‌లో ప్రచారం వేడిక్కినట్లు కన్పిస్తోంది.
పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ఉన్న నేతలకుతోడుగా స్టార్ క్యాంపెనర్లు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో ముందున్నారు. 18ఏళ్లు ఎమ్మెల్యే చేసిన అనుభవం ఆయనకు ఉండటం ఆయనకు కలిసి రానుంది. స్థానిక నేతలతో ఆయనకు ఉన్న పరిచయాలు ఈ ఎన్నికలో ఉపయోగపడునున్నాయి. అదేవిధంగా బీజేపీ పెద్దలు ఈటలకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు. ఆయన స్థానికేతరుడు కావడం ఆయనకు మైనస్ గా మారనుంది. ప్రచారంలోనూ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీలతో పోలిస్తే కాస్తా వెనుకబడినట్లు ఉందనే టాక్ విన్పిస్తోంది.
టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు అండగా స్థానిక, స్థానికేతర నేతలు నిలుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంత్రి హరీష్ రావుకు తోడుగా స్థానిక నేతలైన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్, ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరుల నేతలంతా గెల్లు శ్రీనివాస్ తరుఫున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరో పది రోజుల్లో స్టార్ క్యాంపెయినర్లు హుజూరాబాద్ ను వీడినా స్థానిక టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయనకు అండగా ఉండనున్నారు. ఈనెల 27 తర్వాత స్థానిక నేతలంతా హూజురాబాద్‌లో పోల్ మెనేజ్మెంట్ చక్కబెట్టే అవకాశం ఉంది. కాగా ఈ ఎన్నికల్లో రిజల్ట్ ఎవరికి అనుకూలంగా వస్తుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.