కరోనా కారణంగా విమానయాన రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. విమానాలను నడపడం ఇబ్బందిగా మారడంతో కొన్ని సంస్థలు ఇప్పటికే మూసేశాయి. ఇంధనం ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కష్టతర సమయంలో భారతీయ శాస్త్రవేత్త పునీత్ ద్వివేది ఓ శుభవార్తను చెప్పారు. బ్రాసికా కెరినాటా అనే ఓ రకమైన ఆవాల మొక్క నుంచి తీసిన నూనె నుంచి విమానాల్లో వినియోగించే ఇంధనాన్ని తయారు చేయవచ్చని పునీత్ బృందం తెలియజేసింది. ఇలా తయారు చేసిన ఇంధనం ద్వారా వెలువడే కర్భన ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయని, 68 శాతం మేర ఉద్గారాలను తగ్గించవచ్చని పునీత్ పరిశోధకుల బృందం వెల్లడించింది. ఇక అమెరికాలో విమానాల ద్వారానే అధికంగా వాతావరణ కాలుష్యం అవుతున్నది. దీనిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. ఆవాల మొక్క నుంచి విమానాలకు కావాల్సిన లీటర్ ఇంధనం తయారు చేయడానికి 0.12 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మాములు చమురు ఇంధనంతో పోలిస్తే, ఆవాల మొక్కతో తయారు చేసే ఇంధనం చౌకైనది మాత్రమే కాకుండా, పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు కూడా తక్కువగా ఉంటాయని పునీత్ పరిశోధకుల బృందం తెలియజేసింది. ఈ ఇంధనం ఉత్పత్తికి అవసరమయ్యే ముడి సరుకులు, ఆర్థిక వనరులు సమకూరిస్తే పెద్ద ఎత్తున ఇంధనం తయారు చేస్తామని పునీత్ పేర్కొన్నారు.