ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు భారీగా నమోదయ్యాయి నామినేషన్లు. 15న మునిసిపాలిటీ, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం అయిన కుప్పం, నెల్లూరు కార్పోరేషన్ పైనే అందరి ఫోకస్ పడింది. కుప్పంలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అక్కడ ఎలాగైనా పరువు నిలుపుకోవాలని టీడీపీ నేతలు పట్టుమీద వున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు.
ఇదిలా వుంటే.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు చంద్రబాబు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు.
నామినేషన్ దాఖలు చేసే కేంద్రం వద్దే టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగింది. మధ్యాహ్నం జరిగిన దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 మంది వరకు దాడిలో పాల్గొని వెంకటేశ్‌ను కొట్టారు. వెంకటేశ్‌పై దాడిచేయడమే కాకుండా నామినేషన్ పత్రాలు చించేశారు.తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరంలో వార్డు సభ్యురాలిని బెదిరించాడో వైసీపీ నేత. కాచవరం ఒకటవ వార్డులో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి బొడ్డు శిరీష. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని గ్రామ ఉప సర్పంచ్ చామంతుల వెంకన్న బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి.