కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాలుగా భారత్‌తో పాటు యావత్తు ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా వైరస్ ధాటికి తట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మళ్లీ పెరుగుతున్నాయి. భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆలయాల్లో కోవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మాస్క్ ధరించని భక్తులను ఆలయాల్లోకి అనుమతించవద్దని, అంతేకాకుండా సేవా టికెట్ల జారీ 50 శాతానికి పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు ఆలయ క్యూలైన్లలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.