రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యువ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో 30 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టారు. ఈ కేసులో నిందితులకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్ లను కొట్టివేసింది. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా సుమన్ గత కొన్నేళ్లుగా ప్రైవేట్ క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్‌లలో అతడు క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎక్కడా పోలీసులకు చిక్కకుండా గుత్తా సుమన్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లక్షల రూపాయలు పెట్టి పేకాట ఆడేవారిని గుత్తా సుమన్ ఆకర్షిస్తున్నాడని, పేకాట ఆడేవారి కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా గ్రూపులను తయారుచేస్తున్నట్లు వారు వెల్లడించారు.
Read Also: నాగశౌర్య ఫామ్ హౌస్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు
వాట్సాప్ చాటింగ్ ద్వారా పేకాట ఆడేవారికి స్థలాన్ని సుమన్ షేర్ చేస్తాడని, డబ్బులను ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేస్తే కాయిన్స్ ఇస్తాడని, పేమెంట్ మొత్తం డిజిటల్ రూపంలోనే తీసుకుంటాడని పోలీసులు వెల్లడించారు. రాత్రిళ్లు అయితే పోలీసులు దాడులు చేస్తారు కాబట్టి.. ఉదయం పూట మాత్రమే పేకాట నిర్వహిస్తాడని.. ప్రతి సిట్టింగ్‌లో కోట్ల రూపాయల లావాదేవీలను సుమన్ నిర్వహిస్తాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గత 6 నెలల నుంచి మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని స్టార్ హోటళ్లలో గుత్తా సుమన్ క్యాసినో నిర్వహిస్తున్నాడని, బర్త్ డే పార్టీల పేరుతో హోటళ్లు అద్దెకు తీసుకుంటున్నాడని తెలిపారు. ఒకవేళ నిందితులు పోలీసులకు దొరికితే తనది పూచీకత్తు అంటూ భరోసా ఇస్తున్నాడని… రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వంలో ఉన్న వారితో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బుకాయిస్తున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. తాను పట్టుబడినా దొరక్కూడదనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రముఖులతో దిగిన ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు.