తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై వివాదం నేపథ్యంలో ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులను మంత్రి సబిత ఇంద్రారెడ్డి సున్నితంగా హెచ్చరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా విద్యార్థులు ఫెయిలయ్యాయని ఆందోళన చెందుతున్నారని.. వచ్చే ఏడాదిలో సెకండియర్ పరీక్షలు ఉన్నందున ఒత్తిడికి గురికావొద్దనే అందరినీ పాస్ చేసినట్లు సబిత వివరణ ఇచ్చారు.
Read Also: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ పాస్
అయితే పరీక్షలు ఫెయిల్ కాగానే ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు నిర్వహించడం సరికాదని మంత్రి సబిత హితవు పలికారు. అసలు ఎందుకు ఫెయిలయ్యామో విద్యార్థులు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఫెయిలైన వారిని పాస్ చేయడం ఇదే చివరిసారి అని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇక నుంచి ధర్నాలు చేస్తే పాస్ చేస్తామని భావించొద్దని హెచ్చరించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో డిజిటల్ తరగతులను తాము ఆషామాషీగా, నామ్‌కే వాస్త్‌గా నిర్వహించలేదని మంత్రి సబిత స్పష్టం చేశారు.