ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమయిన అన్యాయం జరగకుండా చూస్తామని, పీఆర్సీ విషయంలో కాస్త ఓపికతో వుండాలన్నారు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామన్నారు మంత్రి బొత్స. ఐ.ఆర్. సైతం ప్రకటించామని తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు కొంత ఓపిక పట్టాలన్నారు. పురపాలక సంఘాల్లో పనులు చేసిన గుత్తేదారుల బిల్లుల చెల్లింపు., ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇస్తామని బొత్స స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపు ఆగలేదని, అనవసర రాద్ధాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
గ్రామ పంచాయితీ నిర్వహణ ఖర్చులు చెల్లింపుకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామన్నారు. ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశ్యం లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు వాస్తవాలు పరిశీలించకుండా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.