సినిమా వాళ్ళకు పండగ సీజన్ అంటే భలే ప్రేమ. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ సీజన్ ను సొమ్ము చేసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఇబ్బంది లేదనేది వారు చెప్పే మాట. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమా…. ఈ నాలుగైదు రోజులు జనాలకు సినిమా చూసే మూడ్ బాగా ఉంటుందని సినిమా వాళ్ళ నమ్మకం. అలానే దసరా నవరాత్రుల సమయంలోనూ సినిమాలను రిలీజ్ చేస్తే… విజయం ఖాయమన్నది ట్రేడ్ వర్గాలు చెప్పే మాట. ఇక తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగానూ కొన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే అది ఎగ్జామ్ సీజన్ కావడంతో ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలకు పెద్దంత ఆదరణ లభించదని కొందరంటారు. ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ తర్వాత మాత్రం పండగ సీజన్స్ ను మెగా హీరోలు భలే బుక్ చేసుకున్నారు.
ఇందులో మొదట రాబోతోంది ‘ట్రిపుల్ ఆర్’ మూవీ. జూ. ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత దీపావళి కానుకగా వరుణ్ తేజ్ ‘ఘని’ రాబోతోందని నిర్మాతలు గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. అలానే క్రిస్మస్ కానుకగా అల్లు అర్జున్ ‘పుష్ప’ విడుదల కాబోతోంది. ఇక సంక్రాంతికి వారం ముందు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి కానుకగా ఇప్పటికే మూడు సినిమాలు బెర్త్ లను కన్ ఫామ్ చేసుకోగా, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ కూడా అందులో ఒకటి కావడం విశేషం. ఈ సినిమా జనవరి 12న జనాల ముందుకు రాబోతోంది. ఈ రకంగా దసరా నుండి వచ్చే సంక్రాంతి వరకూ ప్రతి పండగనూ మెగా ఫ్యామిలీ హీరోలే ఆక్యుపై చేయడం విశేషం.