బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఉడుత ఊపులకు భయపడేది లేదని, కేంద్రమే రాష్ట్ర పోలీసులకు ఈ మధ్య అనేక అవార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ విధానంలో ఏ హక్కుతో కేంద్రం రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నిఘా పెడుతుందో సీఎమ్ రమేష్ చెప్పాలి. సీఎం రమేష్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు.
టీటీడీలో ఉన్నప్పుడు రాయలసీమలో అన్ని కాంట్రాక్టుల మీద కర్చీఫులు వేసిన వ్యక్తి సీఎం రమేష్ కాదా అన్నారు. 28న మీటింగ్ పెట్టి ఏం చేస్తారు? తిరుపతి, బద్వేలు లో ఏం జరిగింది? ప్రజలకు తెలియదా? అన్నారు విష్ణు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన చట్టంలో హామీల విషయం ఏం చేశారు? ఇలా బెదిరింపులకు పాల్పడితే రాష్ట్ర ప్రజలు సహించరు. కేంద్రానికి నిధులు అమెరికా నుంచి వస్తాయా? రష్యా నుంచి వస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో తీసుకున్న నిధులనే దామాషా ప్రాతిపదికన పంపిణీ చేస్తుంది. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు కాకుండా అదనంగా ఒక రూపాయి అయినా ఇచ్చారా? అని మల్లాది విష్ణు అన్నారు.