ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం. దీంతో టీడీపీ అధినేత దీక్షలు చేపట్టడం.. అనంతరం పట్టాభి అరెస్ట్, అసెంబ్లీ సమావేశాల ఘటన ఇలా ఒక్కో ఘటనకు ఏపీ రాజకీయాలు అతిథ్యమిచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల నారా భువనేశ్వరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుఫున ఆర్థికసాయం అందజేశారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. తనపై వైసీపీ నేతల చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనంటూనే పలు వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. అయితే ఆమె మాటలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దీంతో నేడు నారా లోకేష్ వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆర్థికసాయం ఇవ్వడానికి వెళ్లి మా అమ్మపై వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.