9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఈ సిఫార్సులు చేసింది.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న ( కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి)తో పాటు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ భారత ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఇక, నలుగురు హైరోర్టు ప్రధాన న్యాయమూర్తులను.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్. ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే.మహేశ్వరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి. రవికుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ పేర్లు కూడా సిఫార్సు చేశారు.. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది, ( మహిళ న్యాయమూర్తి) పేరును కూడా సిఫార్సు చేసింది కొలీజియం. సుప్రీం కోర్టులో ఖాళీ గా ఉన్న మొత్తం 9 మంది న్యాయమూర్తుల నియామకాలకు సిఫార్సులు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేతృత్వంలో మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం.. జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏ.ఎమ్. ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సిఫార్సులు చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పిఎస్ నరసింహా పేరును కనుక ప్రభుత్వం ఆమోదిస్తే, బార్ అసోసియేషన్ నుంచి ఇప్పటివరకు నేరుగా న్యాయమూర్తులుగా నియామకమైన 9 మందిలో ఒకరు కానున్నారు.