చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం నాడు జూ.ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడం స్థానికంగా చర్చకు దారితీసింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నందమూరి ఫ్యామిలీతో పాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు కూడా స్పందించారు. జూ.ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా అసెంబ్లీలో జరిగిన ఘటనను సున్నితంగా ఖండించాడు. అతడు తన వీడియోలో ఎక్కడా చంద్రబాబు, భువనేశ్వరి, వైసీపీ నేతల పేర్లను ప్రస్తావించలేదు. దీంతో జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఎన్టీఆర్ ఆది, సింహాద్రిలా రెచ్చిపోతాడు అనుకుంటే చాగంటి ప్రవచనాలు చెప్పాడంటూ వర్లరామయ్య, బుద్ధా వెంకన్న లాంటి నేతలు ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలకు గట్టి హెచ్చరికలు పంపకుండా ఎన్టీఆర్ తప్పు చేశాడని.. అసలు స్పందించకపోయినా బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు.
Read Also: ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్యాంప్ పాలిటిక్స్ షురూ..!
అయితే టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఏకంగా చంద్రబాబు కంచుకోట కుప్పంలోనే ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. మరోసారి తమ హీరోను విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ టీడీపీ నేతలను గట్టిగానే హెచ్చరించారు. ఎన్టీఆర్‌పై నోరుపారేసుకుని అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పర్యటనలోనూ ఎన్టీఆర్ అభిమానులు హల్‌చల్ చేసి ‘కాబోయే సీఎం ఎన్టీఆర్’ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కాగా ఏపీలో ఎక్కడా లేని విధంగా కుప్పంలోనే ఎన్టీఆర్ అభిమానులు తరచూ నిరసనలకు దిగుతుండటంతో దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందేమో అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.