సంచలనంగా మారిన ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అ్పపగించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు జార్ఖండ్ సీఎం. ఈ కేసును సుమోటోగా విచారించనున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే.. తనను యాక్సిడెంట్‌లో చంపేయాలని దుండగులు కుట్ర పన్నారని, త్రుటిలో తప్పించుకోగలిగానని ఫతేపూర్ జిల్లా అడిషనల్ జడ్జి అహ్మద్‌ఖాన్… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ ని హత్య చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఉత్తమ్ ఆనంద్ మొదట రోడ్డు ప్రమాదంలో మృతిగా భావించగా అతను హత్య చేయబడినట్లుగా నిర్ధారణ అయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే కావాలనే ఆయనను టెంపోతో ఢీ కొట్టి హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
జులై 28న ఉదయం 5 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కగా జడ్జి ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా వేగంగా వచ్చిన ఓ టెంపో ఆయనను ఢీ కొట్టి వెళ్ళిపోయింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అయినా ఆ టెంపో ఆయన్ని చంపాలనే ప్లాన్ తోనే వెనుకవైపు నుంచి ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది..టెంపో ఢీకొన్న వెంటనే ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేసి ఆ టెంపో డ్రైవర్ ను, మరో ఇద్దరినీ అరెస్టు చేయగా..జడ్జిని ఢీకొట్టిన టెంపో కూడా ఎక్కడో దొంగిలించి తీసుకొచ్చిందేనని పోలీసులు విచారణలో తేలింది. ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులు నిర్ధారించారు.