తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామ శివారులో సాయితేజకు సైనిక గౌరవవందనం నిర్వహించడానికి చిన్న మైదానాన్ని సిద్ధం చేశారు. మైదానం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.సాయితేజ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో… కుటుంబ సభ్యుల DNA శాంపిళ్ల ఆధారంగా గుర్తించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.
ప్రస్తుతం సాయి భౌతిక కాయం బెంగళూరు ఎయిర్ బేస్‌లో ఉంది. ఇవాళ ఉదయం పదిగంటల లోపు స్వగ్రామం ఎగువరేగడకు తీసుకురానున్నారు ఆర్మీ అధికారులు. మరోవైపు అమర జవాన్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ సాయితేజ కుటుంబానికి అందించారు.హెలికాఫ్టర్ ప్రమాదంలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడంతో .. ఎగువరేగడ గ్రామస్తులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇవాళ జరిగే అంత్యక్రియలకు భారీగా తరలిరానున్నారు.