ఏపీలో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. కానీ అధికారికంగా వైసీపీలో చేరలేదు. అలా చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుంది. అప్పుడు అనర్హత వేటు పడే అవకాశముంటుంది. దీంతో ఆయన జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు.
Read Also: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. వైసీపీపై ఫిర్యాదు
ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆయన వైసీపీ కండువా వేసుకుని కనిపించారు. అనంతరం సన్నిహితుల సూచనతో వైసీపీ కండువా తీసేసినా అప్పటికే ఆయన కండువా వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి వెళ్తుందో లేదో వేచి చూడాలి. కాగా ఇప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వల్లభనేని వంశీ మోహన్, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లాంటి వారు వైసీపీలో కొనసాగుతున్నా అధికారికంగా ఆ పార్టీ కండువాలు కప్పుకోలేదు.